100 శాతం ఫలితాలు వస్తే లెక్చరర్లు, విద్యార్థులను సన్మానిస్తా!

 ఒకప్పుడు చిన్నకోడూరు కళాశాల మంచి పేరు తెచ్చుకుంది. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. 'అన్ని సౌకర్యాలు ఉన్న చిన్నకోడూరు కళాశాలలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో లెక్చరర్లు ఆలోచించాలి. విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్లకుండా భోజన వసతి ఏర్పాటు చేశాం. కళాశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. వందశాతం ఫలితాలు తెస్తే లెక్చరర్లకు, విద్యార్థులకు సన్మానం చేస్తా. ప్రస్తుతం కాలేజీలో ఉన్న 142 మంది విద్యార్థుల్లో ప్రతి ఒక్కరూ పాస్ కావాలి. 100 శాతం ఉత్తీర్ణత తేవాలి. కళాశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ప్రతి విద్యార్థి తరగతికి హాజరుకావాలి. చదువుకు ఏ సమస్య అడ్డుకాదు.' అని మంత్రి వివరించారు. అనంతరం విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీకి వచ్చిన ట్రాక్టర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ కాముని శ్రీనివాస్, ఇంటర్ విద్యా ఆర్‌ఐఓ సుధాకర్, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు.